ప్రశ్నలు వేయడమే జ్ఞానం అదే ప్రశ్నోపనిషత్ సారం!

ప్రశ్నలు వేయడమే జ్ఞానమని ఉపనిషత్తులు చెప్పాయి. ఆలోచన కలిగిన ‘ప్రశ్న’
అనితరసాధ్యమైన ‘సమాధానాన్ని’ అన్వేషించడానికి సాధనంగా మారుతుంది.
ప్రశ్నలేనిదే అన్వేషణ జరగదు. అద్భుత ఆవిష్కరణలు సమాధాన రూపేణా
ఆవిర్భవించవు. ఇందుకు నిదర్శనమే ప్రశ్నోపనిషత్తు.
తీర్థయాత్రలలో
భాగంగా పిప్పలాద మహర్షి ప్రయాగక్షేత్రంలో కాత్యాయనుని కొడుకు కబన్ధితో
జరిపిన ప్రశ్నోత్తర సందర్భం సృష్టి రహస్యాన్ని వర్ణిస్తుంది.
‘‘విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం: సహస్ర రశ్మిః శతధా వర్తమానః ప్రాణః ప్రజానాముద యత్యేష సూర్యః’
విశ్వమే రూపంగా కలవాడు, సహస్రకోటి కిరణాలతో ప్రాణికోటికి ప్రాణమైన
సూర్యుడు అదుగో ఉదయిస్తున్నాడు. చంద్రప్రకాశాన్ని ఉత్తేజపరుస్తూ జీవనాధారమై
వస్తున్నాడని పిప్పలాదుడు చెప్పిన అమృతవాక్కులు అధర్వణవేదానికి చెందిన
ప్రశ్నోపనిషత్తులోని అక్షరసత్యాలు.
ప్రశాంత వాతావరణంలో ఓరోజు కబన్ధి గురువైన పిప్పలాద రుషితో - ‘చరాచర
జగత్తులో ఉంటున్న ఈ ప్రాణులంతా ఎక్కడనుండి పుడుతున్నాయి?’ అని సృష్టి
ఆవిర్భావాన్ని, ప్రాణుల పుట్టుకనూ ప్రశ్నిస్తాడు.
ప్రపంచంలోని సకల జీవసమూహాన్నీ సృష్టించేవాడు బ్రహ్మ. అతను తపస్సు చేసి
సృష్టి రచనకు శ్రీకారం చుట్టాడు. తపశ్శక్తితో ‘పదార్థం- శక్తి’అనే జంటను
సృష్టించాడు. అవే అన్నప్రాణాలు. అన్నప్రాణాల సమ్మేళనం వల్లనే అనేక రకాల
జీవరాశి ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
అన్నంలో చంద్రుడూ, ప్రాణంలో సూర్యుడూ నిత్యమై, నిఖిలమై ఉంటున్నారు.
అందుకే బ్రహ్మ మొట్టమొదట అన్నప్రాణాలైన ‘పదార్థం- శక్తి’ సృష్టించాడు.
వీటితో సృష్టిరచన ఎలా జరిగిందో వివరించాడు పిప్పలాదుడు.
ప్రతిరోజూ ప్రాణమే సూర్యుడిలా ఉదయించి అన్నిప్రాణులకూ తన ప్రకాశంతో
జీవనాధారమైన శక్తినిస్తుంది. తన సహస్రకోటికిరణాలతో అంతటా వ్యాపించగలిగే
సూర్యుడే సర్వాత్మ. సకల ప్రాణులకూ ఆశయమై, జగన్నేత్రమై, వెలుగొందుతూ జన్మను
ప్రసాదిస్తాడు. కనుక సూర్యుడే శక్తిచంద్రుడు పదార్థం. సూర్యుని వెలుగు
వల్లనే చంద్రుడు ప్రకాశిస్తాడు కదా! అలాగే శక్తివల్లనే పదార్థం
ఏర్పడుతుంది.
చంద్రుడు భూమిలోని సారానికి కారకుడు. సృష్టిలోని అన్నం చంద్రుని స్వభావ
ంతోనే ఏర్పడుతుంది. నిశీధికి రారాజు అయిన చంద్రుణ్ణే ప్రభావితం చేసే
సూర్యభగవానుని ఆరాధించే విధానాన్నీ ప్రశ్నోపనిషత్తు వివరించింది.
సూర్యునిచే నిర్మింపబడిన కాలమే బ్రహ్మం. ఆయనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే
రెండు గతులున్నాయి. సంవత్సరమంటే కాలమే. ఈ కాలమే జగతికి ఆధారం. ప్రపంచంలో
పుట్టి తన సంసారచక్రానికి కోరికలతో కట్టుబడి జీవించేవారు దక్షిణాయనం ద్వారా
చంద్రలోకాన్ని పొంది మళ్లీ మళ్లీ జన్మను పొందుతారు. ఎవరు సత్యవంతులై
ఆత్మతత్వాన్ని అన్వేషించేవారుగా ఉంటారో, వారే జీవిత పరమార్థాన్ని
తెలుసుకుని ప్రాణస్వరూపమైన సూర్యలోకాన్ని ఉత్తరాయణం ద్వారా పొందుతారు.
సూర్యరూపశక్తే సకల సృష్టికీ ఆదికారణం. మాసమే ప్రజాపతి. దానిలో కృష్ణపక్షం
పదార్థం. శుక్లపక్షం శక్తి. అహోరాత్రులు ప్రజాపతి. దానిలో పగలు శక్తి-
రాత్రి పదార్థం. అలా అన్నమే ప్రజాపతి. అందులో నుండే శక్తి కలుగుతుంది.
దానినుండే ప్రాణులంతా పుడుతున్నారని సవివరంగా ప్రాణుల పుట్టుకనూ, వారు
పొందే స్థితిగతులనూ విశదీకరిస్తాడు పిప్పలాద మహర్షి. అద్భుతమైన చరాచర
సృష్టి ‘పదార్థం- శక్తి’. అనే జంటనుండి ఆవిర్భవించిందనే విషయాన్ని చెప్పిన
ప్రశ్నోపనిషత్తు శాస్త్రీయ విజ్ఞాన సమన్వయంతో సృష్టి రహస్యాన్ని
వర్ణించింది. అసలు ప్రాణానికి సూర్యునితో, అన్నానికి చంద్రునితో తాదాత్మ్యం
చేసి ఆధ్యాత్మికపరంగా వివరించడమనేది వేదాంత తత్త్వశాస్త్రంలో ఆదిలోనే
అర్థవంతంగా సాధించిన అపూర్వ విజయం. అదే ప్రశ్నోపనిషత్ సారం.
శ్లోకం
విదితాఖిల శాస్త్ర సుధాజలధే
మహితోపనిషత్కథితార్థనిధే,
హృదయే కలయే విమలం చరణం
భవ శంకర దేశిక మే శరణమ్
శాస్త్రజ్ఞానమనే అమృత సముద్రాన్ని ఆపోశన పట్టిన మహత్తరమైన ఉపనిషదర్థాలకు
సుధానిధీ, పరమ పవిత్రమైన నీ పాదాన్ని హృదయంలో తలచినంతమాత్రానే శరణాగతిని
ప్రసాదించే ఓ శంకరాచార్యా! నీకు నమస్కారం.
-----------------------------------------------------------------------
No comments:
Post a Comment